తెలంగాణలో ఖాళీ అవుతున్న రెండు రాజ్యసభ సీట్లకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్ధులను ప్రకటించింది. సిట్టింగ్ రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వీకి మళ్ళీ మరోసారి అవకాశం కల్పించింది. రెండో అభ్యర్ధిగా సిఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఖరారు చేసింది. కాంగ్రెస్ అధిష్టానం సింఘ్వీకి మొగ్గు చూపగా, సిఎం రేవంత్ రెడ్డి వేం నరేందర్ రెడ్డికి సీటు ఇవ్వాలని పట్టుబట్టినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలంతో మొదటి అభ్యర్ధి సింఘ్వీని ఎటువంటి ఇబ్బందీ లేకుండా గెలిపించుకోగలదు. కానీ బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్ధిని బరిలో దించితే రెండో సీటుకి ఎన్నికలు తప్పవు. అప్పుడు మజ్లీస్ మద్దతు అవసరం పడుతుంది.
కానీ ఈరోజు ఉదయం వరకు బీఆర్ఎస్ పార్టీ ఎవరి పేరు ప్రకటించలేదు. ఒకవేళ బీఆర్ఎస్ బరిలో లేకపోతే కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు ఏకగ్రీవంగా గెలుచుకోగలదు. నామినేషన్స్ గడువు నేటితో ముగుస్తుంది. కనుక ఇద్దరూ నేడు నామినేషన్స్ దాఖలు చేయనున్నారు.