మేము కేవలం బ్రాండెడ్ ప్రొడక్ట్స్ మాత్రమే వాడుతాము. కనుక మా ఆరోగ్యానికి ఏమీ డోకా లేదని చాలా మంది భ్రమలో ఉంటారు. వారి భ్రమలను హైదరాబాద్ సిసిఎస్ స్పెషల్ క్రైమ్ టీమ్ పోలీసులు పటాపంచలు చేశారు.
హైదరాబాద్‌లోని ఆకస్మిక దాడులు చేసి బేగం బజారుకి చెందిన జయరాం (30), దూళ్ళపల్లికి చెందిన కచ్వా సురేందర్ (34), రాజస్థాన్‌లోని బర్మార్‌కు చెందినా హనుమాన్ రామ్ (21)ని అరెస్ట్ చేశారు.
వారి నుంచి 1,340 నకిలీ రెడ్ లేబుల్ టీ ప్యాకెట్లు, 1,000 నకిలీ తాజ్ మహల్ టీ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 1,900 నకిలీ సర్ఫ్, టైడ్, ఏరియల్ వగైరా బట్టల సబ్బు పౌడర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
అంతే కాదు.. 3,600 నకిలీ గుడ్ నైట్ రీఫిల్స్, 75 కేజీల కల్తీ టీపొడి స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు వివిధ బ్రాండడ్ కంపెనీలకు చెందిన 9,500 ఖాళీ ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు.
వారు ముగ్గురూ ఈ నకిలీ ఉత్పత్తులను, వాటి కవర్లు, ప్యాకెట్లను గుజరాత్ నుంచి తెప్పించుకొని హైదరాబాద్‌లోని ఘోషామహల్, అఫ్జల్ గంజ్, బేగంబజార్ తదితర ప్రాంతాలలో హోల్ సెల్ మరియు రీటెయిల్ వ్యాపారులకు తక్కువద ధరలకు అమ్ముతుంటారని పోలీసులు తెలిపారు.
ఇప్పటికే హైదరాబాద్‌లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్, నకిలీ పసుపు, నకిలీ కారం వంటివి తయారుచేసి అమ్ముతున్నవారిపై దాడులు చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఇన్ని రకాల నకిలీ ఉత్పత్తులు మార్కెట్లో ఒరిజినల్‌గా చలామణి అవుతున్నాయనే కొత్త విషయం బయటపడింది.