తెలంగాణలో కొత్తగా విద్యుత్ కనెక్షన్స్ కోసం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. ఇప్పటి వరకు గృహాలు, వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు కొత్తగా విద్యుత్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారు కోరుకున్న స్థలం వరకు విద్యుత్ స్థంభాలు, కొత్తగా విద్యుత్ వైర్లు వేసి కనెక్షన్స్ ఇచ్చేందుకు దూరాన్ని బట్టి ఛార్జీ వసూలు చేసేవారు. కానీ ఇకపై కిలోవాట్స్ లెక్కన ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఉదాహరణకు గృహ వినియోగం కొరకు విద్యుత్ సరఫరా చేసేందుకు కొత్తగా విద్యుత్ స్థంభాలు, కొత్తగా విద్యుత్ వైర్లు వేయాల్సివస్తే ఒక కిలోవాట్ వరకు రూ. 500 చెల్లిస్తే సరిపోతుంది. ఒకటి నుంచి 5 కిలో వాట్స్ వరకు కనీస ఛార్జ్ షీట్ రూ.500, ఆ పైన ప్రతీ కిలోవాట్‌కి రూ.600 చొప్పున చెల్లిస్తే సరిపోతుంది. ఎంత దూరం నుంచి ఎన్ని విద్యుత్ స్థంభాలు వేశారు? ఎన్ని మీటర్ల వైర్లు బిగించారనే లెక్కలు ఉండవు. ఉదాహరణకు 7 కిలోవాట్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే, రూ.500+1200 కలిపి మొత్తం రూ.1700 ఫిక్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
ఇదేవిధంగా ఎల్‌టీ, హెచ్‌టీ కనెక్షన్స్ కోసం వేర్వేరుగా ఫిక్స్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.