చర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యరార్థం దక్షిణ మధ్య రైల్వే శాఖ స్లీపింగ్ ప్యాడ్స్ ఏర్పాటు చేసింది. దూర ప్రాంతాల నుంచి వచ్చినవారు లేదా రైలు కోసం రైల్వే స్టేషన్లో ఎదురు చూస్తున్నవారు హాయిగా విశ్రాంతి తీసుకునేందుకు వీటిని ఏర్పాటు చేసింది.
రైలు పెట్టెలో బెర్తుల మాదిరిగానే వీటిని ఏర్పాటు చేశారు. వీటికి లాకర్ సదుపాయం కూడా ఉంది. కనుక ప్రయాణికులు తమ వస్తువులను లాకర్‌లో పెట్టి హాయిగా నిద్రపోవచ్చు. అవసరమైతే బయటకు వెళ్ళి రావచ్చు. ఓ విధంగా ఇది మోడ్రన్ డార్మిటరీ అని చెప్పవచ్చు.
వీటిని రెండు గంటలకు అద్దె రూ.200, ఆరు గంటలకు రూ.400, 12 గంటలకు రూ.800, 24 గంటలకు రూ.1,200గా నిర్ణయించారు.
ప్రయాణికులు బయట హోటల్స్ లేదా రైల్వే రిటైరింగ్ రూములు దొరకక ఇబ్బంది పడుతుంటారు. ఒకవేళ దొరికినా 24 గంటలకు అద్దె చెల్లించాల్సి ఉంటుంది.
కానీ కొత్తగా ఏర్పాటు చేసిన ఈ స్లీపింగ్ ప్యాడ్స్ లో రెండు నుంచి 24 గంటల వరకు అవసరాన్ని బట్టి అద్దె చెల్లించి వాడుకోవచ్చు. కనుక ఇవి ప్రయాణికులకు చాలా సౌకర్యమనే చెప్పవచ్చు.