హైదరాబాద్‌ మెట్రో: తాజా సమాచారం

February 21, 2026
img

హైదరాబాద్‌ మెట్రోలో అన్ని మార్గాలలో కలిపి రోజుకి సుమారు 4.5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. నగరంలో పలు ప్రాంతాలలో విలువైన భూములు, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. అయినప్పటికీ ఈ సంస్థ నష్టాలలో కూరుకుపోయింది.

కనుక దీనిని నిర్మించి నిర్వహిస్తున్న ఎల్&టి కంపెనీ ఈ ప్రాజెక్టు నుంచి పూర్తిగా తప్పుకోవాలని గత ఏడాదిలోనే నిర్ణయించుకుంది. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం దీని పూర్తి బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. 

అనేక ఆర్ధిక, సాంకేతిక, న్యాయ పరమైన అంశాలతో కూడిన వేలకోట్ల విలువైన ఈ బదిలీ ప్రక్రియ చాలా సంక్లిష్టమైనది. కనుక దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం రెండు కన్సల్టెన్సీ సంస్థలను నియమించింది. 

వాటిలో సాంకేతిక పరమైన అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్, ఆర్ధిక, న్యాయ పరమైన అంశాల కొరకు ఐడీబీఐని నియమించింది. వీటిలో ఐడీబీఐ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసింది.

దీని ఆధారంగా ఎల్&టి కంపెనీ, ప్రభుత్వం తరపున హెచ్ఎంఆర్ఎల్ ప్రతినిధులు చర్చించుకొని ఒక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ పూర్తయితే ఈ నెల 23న జరిగే మంత్రివర్గ సమావేశంలో హైదరాబాద్‌ మెట్రో టేకోవర్ గురించి చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. ఈ ఏడాది మార్చి 31లోగా మెట్రోని ప్రభుత్వం అధీనంలోకి తీసుకోవాలని గడువు పెట్టుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టింది. 

మెట్రోని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత దాని నిర్వహణ బాధ్యతలు ఎవరికీ అప్పగిస్తుంది? ఏవిధంగా నిర్వహిస్తుంది? అనేది చాలా ఆసక్తికరం. 

Related Post