తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఓ గొప్ప శుభవార్త! టిజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తన ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంచింది. ఈ పెంపుతో కలిపి వారి డీఏ 52.8 శాతానికి పెరిగింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇది అమలులోకి వచ్చినట్లు టిజీఎస్ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ, “టిజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు డీఏ పెంపు కాస్త భారమైనప్పటికీ వారి శ్రమని గుర్తించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వలన టిజీఎస్ ఆర్టీసీపై నెలకు రూ.2.82 కోట్లు అదనపు భారం పడుతుంది. కానీ ఆర్టీసీ కార్మికుల కోసం టిజీఎస్ ఆర్టీసీ సంస్థ, రాష్ట్ర ప్రభుత్వం ఈ అదనపు భారం భరించడానికి సిద్ధంగా ఉన్నాయి,” అని అన్నారు.
టిజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి డీఏ పెంచినందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.