అవును. కానీ హైదరాబాద్ మెట్రోలో కాదు... మధ్యప్రదేశ్ మెట్రోలో!
భోపాల్, ఇండోర్‌లో మెట్రోలు నష్టాలలో కూరుకుపోతుండటంతో మధ్యప్రదేశ్ మెట్రో ఆదాయం పెంచుకునేందుకు ‘సెలబ్రేషన్స్ ఆన్ వీల్స్’ పధకం ప్రకటించింది.
దీని ప్రకారం ఇకపై ఈ రెండు నగరాలలోని మెట్రో స్టేషన్లు, మెట్రో రైళ్ళలో సినిమా షూటింగులు చేసుకోవచ్చు. అలాగే వెబ్ సిరీస్ షూటింగులు చేసుకోవచ్చు.
అంతే కాదు.. ఇప్పుడు ప్రీ-వెడ్డింగ్ షూట్స్ ట్రెండ్ బాగా నడుస్తోంది కనుక అవి కూడా మెట్రో స్టేషన్లు లేదా రైళ్ళలో షూటింగ్ చేసుకోవచ్చు.
అలాగే పిల్లలు, పెద్దలు బర్తే డే పార్టీలు చేసుకోవచ్చు. మ్యారేజ్ డే పార్టీలు, కిట్టీ పార్టీలు కూడా నిర్వహించుకోవచ్చు. వీటి కోసం గంటకు రూ.5,000-7,000 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. కనీసం ఒక గంట నుంచి 7-8 గంటల వరకు మెట్రో రైళ్ళు అద్దెకు తీసుకోవచ్చు. అవసరమైతే ఎంపిక చేసిన మార్గాలలో వరుసగా కొన్ని రోజులు అద్దెకు తీసుకొని షూటింగ్స్, పార్టీలు చేసుకోవచ్చు.
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోని ఎల్&టి కంపెనీ నుంచి స్వాధీనం చేసుకొని దాని నిర్వహణకు సీఎస్ రామకృష్ణారావు నేతృత్వంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
ఒకవేళ వారు హైదరాబాద్ మెట్రోని మళ్ళీ లాభాల బాట పట్టించగలిగితే, మధ్య ప్రదేశ్ మెట్రో అధికారులు వారిని చూసి నేర్చుకోవచ్చు. ఒకవేళ హైదరాబాద్ మెట్రో ఇంకా నష్టాలలో కూరుకుపోతే అప్పుడు మధ్య ప్రదేశ్ మెట్రో అమలుచేస్తున్న ఇటువంటి పధకాలను చూసి నేర్చుకోవాల్సి ఉంటుంది.
హైదరాబాద్, మధ్యప్రదేశ్ మెట్రోల లక్ష్యం దానిని కాపాడుకోవడమే. కనుక ఒకరిని చూసి మరొకరు నేర్చుకోవడం మంచిదే.