తమిళనాడు శాసనసభ ఎన్నికలలో 108 సీట్లు గెలుచుకొని టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకి అవసరమైన 118 సీట్లు లేకపోవడంతో కాంగ్రెస్(5), కొన్ని చిన్న పార్టీల మద్దతుతో 112 ఎమ్మెల్యేలను కూడగట్టుకోగలిగారు. కానీ ఇంకా మారో ఆరుగురు ఎమ్మెల్యేలు తక్కువగా ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటుకి విజయ్‌ని ఆహ్వానించేందుకు గవర్నర్ తిరస్కరించడంతో ఒక్కసారిగా తమిళనాడులో రాజకీయాలు వేడెక్కిపోయాయి.
ఆయన అన్నాడీఎంకే-బిజేపి కూటమితో మద్దతు కోసం రహస్య మంతనాలు జరుపుతున్నారని, చెరో రెండున్నరేళ్ళు ముఖ్యమంత్రి పదవి పంచుకుందామని ప్రతిపాదించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరోపక్క ఎన్నికలలో ఓడిపోయినా బద్ద శత్రువులు అన్నాడీఎంకే(53), డీఎంకే (73) చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పాటుకి సిద్ధం అవుతున్నాయని ఊహాగానాలు వినిపిస్తుండటం విశేషం.
విజయ్ మరికొద్ది సేపటిలో మరోసారి గవర్నర్‌ని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకి అనుమతించాల్సిందిగా విజ్ఞప్తి చేయబోతున్నారు. ఒకవేళ అనుమతిస్తే నేడే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
ఒకవేళ ఆయన మళ్ళీ తిరస్కరిస్తే నేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించి, ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని గవర్నర్‌ని ఆదేశించవలసిందిగా కోరుతూ పిటిషన్ వేసేందుకు ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కనుక తమిళనాడులో ఇప్పుడు ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.