రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో తీస్తున్న వారణాశిలో నీటి అడుగున చిత్రీకరించాల్సిన సన్నివేశాలున్నాయి. కనుక అండర్ వాటర్ షూటింగ్ కోసం హైదరాబాద్ శివారులో గగన్ పహాడ్ వద్ద ఓ భారీ కొలను నిర్మించారు. ఈ నెల 18 దానిలో షూటింగ్‌కి ఏర్పాట్లు చేసుకున్నారు.
ఆ కొలనులో నింపేందుకు సుమారు 15 లక్షల లీటర్ల శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలని కోరుతూ వారణాశి టీమ్ జలమండలికి లేఖ వ్రాసింది. రవాణాతో సహా నీటి ఛార్జీలు చెల్లిస్తామని తెలియజేశారు. కానీ ఈ మండు వేసవిలో నగర ప్రజలకు నీళ్ళ కొరత ఏర్పడకుండా ప్రతీరోజూ సరఫరా చేయాల్సి ఉంటుంది. కనుక సినిమా షూటింగ్ కోసం అన్ని నీళ్ళు ఇవ్వలేమని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ కే. అశోక్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలకు త్రాగు నీరు అందించడమే తమ తొలి దశ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
కనుక రాజమౌళి ఈ సన్నివేశాల చిత్రీకరణ వాయిదా వేసుకుంటారా లేక ప్రైవేట్ సంస్థల నుంచి కొనుగోలు చేసి నీళ్ళు ఏర్పాటు చేసుకొని అనుకున్న సమయానికి షూటింగ్ మొదలుపెడతారా? అనే విషయం త్వరలో తెలుస్తుంది.