సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఆర్.బి.చౌదరి (76) రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన అసలు పేరు రతన్ భగత్ రామ్ చౌదరి. మొదట ఇతర వ్యాపారాలు చేసిన అయన దక్షిణాది సినిమాలను గల్ఫ్ దేశాలలో రిలీజ్ చేస్తూ క్రమంగా సినీ పరిశ్రమతో అనుబంధం ఏర్పరచుకున్నారు.
మొదట ‘సూపర్ ఫిల్మ్స్’ పేరుతో తమిళ్, మలయాళంలో అనేక సూపర్ హిట్ సినిమాలు నిర్మించారు. ఆ తర్వాత తమిళ్ సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. ఆ తర్వాత టాలీవుడ్‌లో ప్రవేశించి శుభాకాంక్షలు, సూర్యవంశం, రాజా, సీన్, నువ్వు వస్తావని, నిన్నే ప్రేమిస్తా, శివరామరాజు, లవ్ టుడే, గోరింటాకు వంటి అనేక హిట్స్ అందించారు. టాలీవుడ్‌లో చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, డా.రాజశేఖర్ తదితరులతో ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
ఆర్.బి.చౌదరి సూపర్ గుడ్ ఫిల్మ్స్, సూపర్ గుడ్ కంబైన్స్, మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ సంస్థలు స్థాపించి వాటిపై 98 సినిమాలు నిర్మించారు.
ప్రస్తుతం కోలీవుడ్ నటుడు విశాల్ హీరోగా ‘మకుటం’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇదే ఆర్.బి.చౌదరి చివరి సినిమా కావడంతో విశాల్‌తో కోలీవుడ్, టాలీవుడ్‌కి చెందిన పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.