ప్రముఖ కోలీవుడ్ హీరో విజయ్ దళపతి టీవీకే పార్టీతో ఎన్నికల బరిలో దిగి తొలి ప్రయత్నంలోనే 234 స్థానాలలో 108 గెలుచుకొని రికార్డ్ సృష్టించారు.
కానీ ప్రభుత్వ ఏర్పాటుకి 118 మంది ఎమ్మెల్యేలు అవసరం కనుక కాంగ్రెస్, మరికొన్ని చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుకి సిద్దం అవుతున్నారు. కనుక తనని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా కోరుతూ విజయ్ తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కి ఈమెయిల్ ద్వారా మంగళవారం లేఖ పంపారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనకు అవకాశమిచ్చి రెండు వారాలు సమయం ఇస్తే శాసనసభలో బలనిరూపణ చేసుకుంటానని ఆ లేఖ ద్వారా తెలియజేసినట్లు తెలుస్తోంది.
అన్నాడీఎంకేతో పొత్తులో ఉన్న బిజేపి మొదటి నుంచి టీవీకే పార్టీతో పొత్తుకి ప్రయత్నిస్తూనే ఉంది. ఇప్పటికీ మద్దతు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది. అలాగే ఈ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయి అధికారం కోల్పోయిన డీఎంకే పార్టీ కూడా మద్దతు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసింది.
కానీ విజయ్ ఆ రెండు పార్టీల మద్దతు స్వీకరించేందుకు అంగీకరించలేదు. ఎన్నికల వరకు కూడా డీఎంకేతో పొత్తులో ఉన్న కాంగ్రెస్ పార్టీ మద్దతు స్వీకరించేందుకు సిద్దపడ్డారు.
విజయ్ నేడు గవర్నర్‌ని స్వయంగా కలిసి తనని ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు. అయితే గవర్నర్ ఇప్పటికే సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కనుక నేడో రేపో తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమే. చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకర కార్యక్రమం కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.