తమిళనాడు శాసనసభ ఎన్నికలలో 108 సీట్లు గెలుచుకున్న టీవీకే పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కనుక తమని ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించాల్సిందిగా కోరుతూ ఆ పార్టీ అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌కి ఈమెయిల్ ద్వారా అభ్యర్ధించారు.
ఆయన సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారని లోక్ భవన్ అధికారిక ప్రకటన చేసింది. కేరళ పర్యటనలో ఉన్న గవర్నర్ ఈరోజు మధ్యాహ్నం చెన్నై చేరుకున్నారు. కనుక విజయ్ తన ముఖ్య నేతలతో కలిసి లోక్ భవన్‌కు వెళ్ళి గవర్నర్‌ని మర్యాదపూర్వకంగా కలవనున్నారు.
తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుకి 118 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా టీవీకే పార్టీలో 108 మందే ఉన్నారు. విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచినందున, రాజీనామా చేసి వాటిలో ఒక సీటు వదులుకోవాల్సి ఉంటుంది. మరో సీటు స్పీకర్ పదవికి కేటాయించాల్సి ఉంటుంది. కనుక టీవీకే పార్టీ బలం 106 అవుతుంది.
కాంగ్రెస్ (5), వామ పక్షాలు (2) మద్దతు ఇచ్చేందుకు సిద్దపడినా ఇంకా మరో ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. అన్నాడీఎంకే పార్టీ (54) కూడా మద్దతు ఇచ్చేందుకు సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కానీ రెండు పార్టీలు ఇంకా ఖరారు చేయలేదు.
ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రెండు వారాల సమయం ఇస్తే శాసనసభలో బాలీవుడ్ నిరూపణ చేసుకుంటానని విజయ్ గవర్నర్‌ని కోరనున్నారు. ఇదే విషయం ఈమెయిల్ ద్వారా కూడా తెలియజేసిన తర్వాత గవర్నర్ విజయ్‌ని ప్రభుత్వం ఏర్పాటుకి ఆహ్వానించారు. కనుక ఈరోజు వారి భేటీ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు చేసుకోవడానికే అని భావించవచ్చు. కనుక నేడో రేపో “విజయ్ అనే నేను... తమిళనాడు ముఖ్యమంత్రిగా” అంటూ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖాయమే.