హరీష్‌.. మీకు మీ పార్టీకే ఫ్యూచర్ లేదు: మంత్రి పొంగులేటి

May 23, 2026


img

బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ‘ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని ఆ పార్టీ సీనియర్ నాయకుడు హరీష్‌ రావు చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యంగ్యంగా స్పందించారు. “ముందు మీ ఫ్యూచర్ ఏవిధంగా ఉందో తెలుసుకోండి. బీఆర్ఎస్‌ పార్టీకే ఫ్యూచర్ లేదు. అలాంటి పార్టీలో ఉన్న మీకూ ఫ్యూచర్ ఉండదు. కనుక ముందుగా మీ ఫ్యూచర్ గురించి ఆలోచించుకోండి.

బీఆర్ఎస్‌ పార్టీని ప్రజలు ఎప్పుడో మరిచిపోయారు. మళ్ళీ అవకాశం ఇస్తారని పగటి కలలు కంటే మీ ఇష్టం. కేసీఆర్‌ హయంలో మీ కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ ఎక్కడికక్కడ ఫామ్‌హౌసులు కట్టుకున్నారు. కానీ పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు.

మేము లగచర్లలో పరిశ్రమలు స్థాపించి యువతకు ఉద్యోగాలు కల్పిస్తామంటే దానికీ అడ్డుపడ్డారు. మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డుపడుతున్నారు. చివరికి మేము తెలంగాణ రాష్ట్రం, ప్రజల కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే దానికీ అడ్డుపడుతున్నారు. అసూయకైన హద్దుండాలి కదా?

ఫ్యూచర్ సిటీ భూముల కోసం అమెరికాలో ఎవరితోనైనా ముందస్తు ఒప్పందాలు చేసుకున్నారా? అయినా ఫ్యూచర్ లేని పార్టీ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటే అందరూ నవ్వుకుంటున్నారు,” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.


Related Post