టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అధ్వర్యంలో నేడు ఆ పార్టీ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర సచివాలయం ప్రధాన ద్వారం వద్ద ధర్నా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రైతుల నుంచి కల్లాలలో ఉన్న ధాన్యం, మక్కలు, పొద్దు తిరుగుడు పువ్వులు, జొన్నలు కొనుగోలు చేయాలంటూ ధర్నా చేశారు.
అకాల వర్షాలతో కల్లాలలోని తడిసిపోతున్న పంటలను కాపాడుకునే ప్రయత్నంలో రైతులు వడగాడ్పులు తగిలి విలవిలలాడుతున్నారని, కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు రేయింబవళ్ళు శ్రమించి ధాన్యం పండిస్తే మిల్లర్లు బీ-గ్రేడ్ అని మోసం చేస్తున్నారు. ఆ తర్వాత కొనుగోలు కేంద్రాలలో తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షాలు మొదలయ్యేలోగా రాష్ట్రంలో పండిన ప్రతీ గింజని ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఇంట్లో నుంచి కాలు బయటపెట్టనీయమని కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.
పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి ఆమెను, టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అరెస్ట్ చేసి వ్యానులో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.