టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి తమిళనాడు సిఎం అయ్యేందుకు తోడ్పడినందుకు కాంగ్రెస్ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి.
టీవీకే పార్టీ 108 సీట్లు గెలుచుకొని మ్యాజిక్ ఫిగర్ 118కి పది సీట్ల దూరంలో ఉండిపోయినప్పుడు, దాదాపు మూడున్నర దశాబ్దాలుగా డీఎంకేతో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పాపెట్టకుండా డీఎంకేకి హ్యాండిచ్చి 5 మంది ఎమ్మెల్యేలతో టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించింది.
ఆ కృతజ్ఞతతో లేదా ముందే అనుకున్న ఒప్పందం ప్రకారమో సిఎం విజయ్ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పి. విశ్వనాథ్, రాజేష్ కుమార్‌లకు మంత్రి పదవులు ఇచ్చారు. వారిద్దరూ రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
వామపక్షాలు, ఇతర పార్టీలు తమకు మంత్రి పదవులు అవసరం లేదని బయట నుంచే మద్దతు ఇస్తామని ముందే చెప్పేశాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకొని 59 ఏళ్ళ తర్వాత తొలిసారిగా తమిళనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా అధికారంలోకి వస్తోంది.