పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్టు కావడం, రిమాండ్ మీద చర్లపల్లి జైలుకి వెళ్ళాల్సి రావడం వెనుక పోలీసులు, న్యాయస్థానం ప్రధానపాత్ర పోషించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పార్టీ ఒత్తిళ్ళు అంతకంటే కీలకంగా నిలిచాయని చెప్పవచ్చు.
తమ పార్టీ అనుబంధ సంఘాల ఒత్తిడి చేయకపోయి ఉంటే కాంగ్రెస్, బిజేపిలు కలిసి బండి భగీరథ్‌ని కాపాడి ఆ మైనర్ బాలికకు అన్యాయం చేసి ఉండేవని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
కానీ నేటికీ బండి సంజయ్ పోలీసులపై తీవ్ర ప్రభావం చూపగల పదవిలో ఉన్నారు కనుక ఈ కేసు నిష్పాక్షపాతంగా విచారణ జరగాలంటే ప్రధాని మోడీ ఆయనని తక్షణం పదవిలో నుంచి బర్త్ రఫ్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకుంటే ఈ కేసులో మైనర్ బాలికకు న్యాయం జరుగకపోవచ్చని కేటీఆర్ అన్నారు.
ఈ కేసు విషయంలో బిజేపి అధిష్టానం ఏమనుకుంటుందో తెలీదు. బండి సంజయ్ పార్టీకి అధిష్టానానికి ఎంత విధేయుడు, నమ్మకస్తుడు అయినప్పటికీ ఈ కేసు కారణంగా పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుందని భావిస్తే ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కానీ బిజేపి తదుపరి టార్గెట్ తెలంగాణయేనని ప్రధాని మోడీ స్వయంగా ప్రకటించినందున, రాష్ట్ర రాజకీయాలలో, తెలంగాణ బిజేపిలో కీలకపాత్ర పోషిస్తున్న బండి సంజయ్‌ని పదవి నుంచి తప్పించడం సరికాదని భావిస్తే కేటీఆర్ లేదా మరొకరి ఇలాంటి డిమాండ్స్ పట్టించుకోకపోవచ్చు. కానీ బండి సంజయ్‌పై వేటు పడితే ఆ క్రెడిట్ కూడా బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది.