అల్లుడు గారికి వెండి చెప్పులు బహుమతి!

May 20, 2026
img

ప్రధాని మోడీ పది రోజుల క్రితమే దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయడం మానుకోవాలని పిలుపునిచ్చారు. కానీ వెండి కొనవద్దని ప్రధాని మోడీ చెప్పలేదు కదా?

కనుక మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఓ ధనవంతుడైన వ్యాపారి విదేశం నుంచి వచ్చిన అల్లుడికి స్వచ్చమైన వెండితో చెప్పులు తయారు చేయించిన చెప్పులు బహుమతిగా ఇచ్చాడు.

సుమారు కేజీన్నర బరువు ఉండే ఆ చెప్పులు తయారు చేయడానికి సుమారు పది రోజులు పట్టిందట. వాటికి వాడిన వెండి ఖరీదు నాలుగు లక్షలు. తయారుచేసేందుకు రూ.22,000 కలిపి మొత్తం రూ.4.22 లక్షలు. ఈ వెండి చెప్పుల వార్త, వెండి చెప్పుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

వాటిపై నెటిజన్స్ చాలా ఆసక్తికరమైన కామెంట్స్  చేస్తున్నారు. “ఆ చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళితే అల్లుడు కిడ్నాప్ అయ్యే ప్రమాదం ఉంది. అవి వేసుకొని తిరిగితే నెల రోజుల్లోనే వెండి అంతా అరిగిపోయి రోడ్డుపై మట్టిలో కలిసి పోతుంది.

ఎక్కడికైనా వెళ్ళండి కానీ ఆ చెప్పులు వేసుకొని గుడికో పెళ్ళిళ్ళు శుభకార్యాలకో వెళ్ళకండి. వెళ్ళి బయట విడిచిపెడితే మళ్ళీ కనిపించవు. వాటిని ఎలాగూ వాడుకోలేరు కనుక ఏ దేవాలయానికో విరాళంగా ఇచ్చేస్తే మంచిది.

ఈ వార్త దొంగలకు కూడా తెలిసింది కనుక వాటిని ఇంట్లో పెట్టుకున్నా ప్రమాదమే. వెంటనే బ్యాంక్ లాకరులో పెట్టుకోండి... అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నిజమేగా!

మావగారు ముచ్చటపడి వెండి చెప్పులు చేయించి ఇచ్చినా వాటిని వేసుకోలేని పరిస్థితి. కనీసం ఇంట్లో కూడా ఉన్సుకోలేని పరిస్థితి... విచిత్రంగానే ఉంది కదా? 

Related Post