మూసీ ప్రక్షాళనకు 39 మురుగుశుద్ది ప్లాంట్స్

May 20, 2026


img

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల వివక్ష చూపుతోందని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని ఆరోపిస్తుండటం కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీలకు పరిపాటిగా మారిపోయిందనే చెప్పాలి. కానీ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు మంజూరు చేస్తున్నట్లే నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేస్తోంది. పలు అభివృద్ధి పనులు, సంక్షేమ పధకాలు అమలుచేస్తూనే ఉంది. కానీ ఈ విషయం చెప్పుకోవడంలో రాష్ట్ర బిజేపి నేతలు అశ్రద్ద చూపుతుంటారు కనుక కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌ పార్టీల వాదనలే నిజమని ప్రజలు కూడా భావించే పరిస్థితి నెలకొంది. 

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మూసీనదిని అందమైన రివర్ ఫ్రంట్‌గా మార్చాలంటే ముందుగా దానిలో మురుగు నీరు కలవకుండా ఆపాలి. దాని కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0లో భాగంగా ఏకంగా 39 మురుగునీటి శుద్ధి ప్లాంట్స్ ఏర్పాటు చేసేందుకు రూ.3,975 కోట్లు మంజూరు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. మెట్రో రెండో దశ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్ పంపిస్తే పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖా మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ హామీ ఇచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు.


Related Post