టీఆర్ఎస్‌ పార్టీ జెండా పండుగ... అవసరమే?

May 15, 2026


img

టీఆర్ఎస్‌ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు హైదరాబాద్‌ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, “ఈ నెల 20 నుంచి జూన్‌ 20 వరకు నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్‌ పార్టీ జెండా పండుగ నిర్వహించుకోబోతున్నాము. 

ఈ కార్యక్రమంలో భాగం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాలు, కుదిరితే గ్రామాలలో కూడా టీఆర్ఎస్‌ పార్టీ జెండా గద్దెలు ఏర్పాటు చేసుకొని ఎక్కడికక్కడ పార్టీ జెండాలను ఆవిష్కరించుకుంటాము. ఇది పార్టీ నిర్మాణానికి పునాది వంటిది కనుక ఈ కార్యక్రమంలో పార్టీలో అందరూ పాల్గొంటారు. 

నేను కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొంటాను. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పటికే పార్టీలో పనిచేస్తున్నవారికి, ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీలో చేరేందుకు వచ్చినవారితో కమిటీలు ఏర్పాటు చేసుకుంటాము. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ మొదలుపెడతాము,” అని కల్వకుంట్ల కవిత తెలిపారు.  

ఆమె చెప్పినట్లు జెండా గద్దెలు ఏర్పాటు చేసుకోవడం పార్టీకి పునాది వంటిదే. నియోజకవర్గ, మండల స్థాయిలో పార్టీ జెండా గద్దెలు ఏర్పాటు చేసుకోవడం అంటే అక్కడ ప్రత్యర్ధులకు సవాలు విసిరినట్లే. కనుక ఈ  కార్యక్రమం ఆవిధంగా బలప్రదర్శన, బల నిరూపణగానే భావించవచ్చు. 

పార్టీ జెండా గద్దెలు ఏర్పాటు చేసుకునేందుకు సహకరించే వారు కూడా ఉంటారు. తద్వారా వారు పార్టీలో చేరి తమ ప్రాంతంలో పార్టీని బలోపేతం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లే. అందుకే దీనిని నెల రోజులు ప్లాన్ చేసుకున్నారు. 

ఈ కార్యక్రమం విజయవంతం అయితే ఆ తర్వాత ఆమె చెప్పిన మిగిలిన కార్యక్రమాలు చకాచకా జరిగిపోతాయి. కనుక కల్వకుంట్ల కవిత నేతృత్వంలో టీఆర్ఎస్‌ పార్టీకి తెలంగాణ ప్రజలలో ఏమాత్రం ఆదరణ ఉందో తెలుసుకునేందుకు ఈ ‘సెల్ఫ్ టెస్టింగ్’ అవసరమే.   



Related Post