కేరళం సిఎంగా వీడీ సతీశన్

May 14, 2026


img

కాంగ్రెస్‌ అధిష్టానం వారం రోజులు చర్చించిన తర్వాత కేరళ సిఎంగా వీడీ సతీశన్ పేరు ఖరారు చేసింది. ఈ పదవి కోసం సీనియర్ కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల చాలా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వీడీ సతీశన్‌కు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మద్దతు పలకడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనని సిఎం పదవికి ఎంపిక చేసింది. కాంగ్రెస్‌ అధిష్టానం సిఎం పేరు ఖరారు చేసినందున నేడో రేపో వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంతుంది.  

కనుక ఈసారి ఎలాగైనా ఈ పదవి దక్కించుకొని కేరళం సిఎం అనిపించుకోవాలని ఆరాటపడిన వారిరువురూ తీవ్ర నిరాశకు గురై ఉంటారు.

ముఖ్యంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్‌ పార్టీలో కీలకపాత్ర నిర్వహిస్తున్న కేసీ వేణుగోపాల్‌ ఈ ఎంపికని, నిరాశని జీర్ణించుకోవడం చాలా కష్టమే.

ప్రస్తుతం ఆయన వయసు 64. మరో 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు కేరళం ప్రజలు ఆనవాయితీ ప్రకారం కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించి వామపక్షాల నేతృత్వంలోని ఎల్‌డీఫ్‌కి అధికారంకట్టబెట్టవచ్చు. అంటే మరో పదేళ్ళ వరకు సిఎం పదవి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదన్న మాట.

అప్పటికి కేసీ వేణుగోపాల్‌ వయసు 74 అవుతుంది. కనుక సిఎం పదవికి ఎన్నటికీ అవకాశం లేనట్లే భావించవచ్చు. పాపం కేసీ వేణుగోపాల్‌!


Related Post