నీట్‌ లీకేజ్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్‌కి ఉందా?

May 14, 2026


img

నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడంతో ఇటీవల నిర్వహించిన నీట్ పరీక్షలు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కేంద్రంపై విమర్శలు గుప్పించారు.

బిజేపి పాలిత రాష్ట్రాలలో తరచూ ప్రశ్నాపత్రాలు లీక్ అవుతుండటాన్ని కేటీఆర్‌ తప్పు పట్టారు. నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ అలసత్వం వల్లనే తరచూ ఈవిధంగా జరుగుతోందన్నారు. ప్రశ్నా పత్రాలు లీక్ అయినందున పరీక్షలు రద్దు చేయడంతో దేశంలో 22 లక్షల మంది విద్యార్ధులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.     

నీట్ ప్రశ్నాపత్రాలు లీక్.. పరీక్షల రద్దుకు నిరసనలు వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్‌ అనుబంధ విద్యార్ధి సంఘం బుధవారం లోక్‌ భవన్‌ వద్ద ధర్నాకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకే పెట్టిన బ్యారికేడ్లను దాటుకొని మెయిన్ గేట్ వద్దకు దూసుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేసి వారిని చెదరగొట్టారు. 

కానీ నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్‌పై కేంద్రాన్ని ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్‌ పార్టీకి ఉందా? అని వారు ఆలోచించుకొని ఉండాలి. కేసీఆర్‌ సిఎంగా ఉన్నప్పుడే టిజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రశ్నాపత్రాలు లీక్ కాగా పరీక్షలు రద్దు చేశారు.

అప్పుడు కూడా ఆ పరీక్షలు వ్రాసిన లక్షల మంది విద్యార్ధులు నష్ట పోయారు. అప్పుడు ఇదే బీఆర్ఎస్‌ పార్టీ నేతలు ఏవిధంగా వితండవాదం చేశారో బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది.

ఆ సంగతి మరిచినట్లు ఇప్పుడు నీట్ ప్రశ్నాపత్రాల లీక్ గురించి ప్రశ్నిస్తుండటం, విద్యార్ధుల భవిష్యత్‌ దెబ్బ తింటోందంటూ మొసలి కన్నీళ్ళు కార్చడం చాలా హాస్యాస్పదంగా ఉంది. 

బీఆర్ఎస్‌ పార్టీ హడావుడి పక్కన పెట్టి చూస్తే నీట్ ప్రశ్నాపత్రాలు లీక్ అవడం మామూలు విషయం కాదు. ఇప్పటికైనా నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే గతంలో టిపీఎస్సీలాగే దాని విశ్వసనీయత కూడా దెబ్బ తింటుంది.


Related Post