పని ముగిసింది అందుకే రాజీనామా: ఆకునూరి

May 22, 2026


img

తెలంగాణ విద్యా కమీషన్ చైర్మన్‌ ఆకునూరి మురళి తన పదవికి ఆకస్మికంగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సిఎస్ రామకృష్ణారావుకి పంపించారు. తనకు అప్పగించిన బాధ్యత విజయవంతంగా పూర్తి చేయడంతో రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. ఆయన పదవీ కాలం మరో నాలుగు నెలలు ఉండగా పని పూర్తయింది రాజినామా చేస్తున్నానని చెప్పడం నమ్మశక్యంగా లేదు. కనుక రాజకీయ, విద్యా వర్గంలో చర్చనీయాంశం అయ్యింది.

రాష్ట్ర విద్యా వ్యవస్థ, విద్యా ప్రమాణాలు, పాఠశాలలలో సౌకర్యాల గురించి కమీషన్ చైర్మన్‌గా ప్రభుత్వానికి పలు సిఫార్సులు చేశారు. కనుక ప్రభుత్వ పెద్దలతో చర్చించి వాటిని అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత కూడా ఆయనపైనే ఉంటుంది. కనుక పదవీ కాలం పొడిగింపు ఆశించాలి.

కానీ అవసరమైన సలహాలు ఇచ్చి పని పూర్తయిందని రాజీనామా చేయడంతో ప్రభుత్వ పెద్దల స్పందన సరిగ్గా లేదా? ఈ సంస్కరణలు అమలు చేయడంలో ఏమైనా ఇబ్బందులున్నాయా? లేదా సంబందిత శాఖలో ఉన్నతాధికారులు ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా? అనేది తెలియాల్సి ఉంది. అయన రాజీనామా లేఖపై ప్రభుత్వ స్పందనతో కొంచెం స్పష్టత వస్తుందేమో?


Related Post