ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం ఏమి చేస్తుందో ప్రజలకు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ మేము వస్తే ఫలానా ఫలానవన్నీ తొలగిస్తాం. ఆపేస్తాం... అని చెప్పుకుంటున్నారు రాజకీయ నేతలు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం మారుస్తామని, ‘టీఆర్ఎస్’ని గుర్తుచేస్తున్నట్లున్న ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’గా మారుస్తామని చెప్పుకున్నారు. చెప్పినట్లే మార్చేశారు.
ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వంతు. తాము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి, రాహుల్ గాంధీ విగ్రహాలను తొలగిస్తామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇదివరకే చాలాసార్లు చెప్పారు. ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు కూడా ఆ రద్దుల జాబితాలో మరొకటి చేర్చారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని దాని స్థానంలో మళ్ళీ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తామని హరీష్ రావు అన్నారు.
ఈవిధంగా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను మరో ప్రభుత్వం తిరస్కరించి మళ్ళీ మొదటి నుంచి పనులు చేపడుతుంటే, వాటిపై ఖర్చు చేసిన వేలు, లక్షల కోట్ల ప్రజాధనం వృధా అవుతూనే ఉంటుంది. విలువైన సమయం కూడా వృధా అవుతూనే ఉంటుంది. మూడడుగులు ముందుకి ఆరడుగులు వెనక్కి అన్నట్లు ప్రభుత్వాలు పనిచేస్తుంటే ఇక రాష్ట్రం ఏవిధంగా అభివృద్ధి చెందుతుంది?