బండి భగీరథ్ పోక్సో కేసులో అరెస్ట్ అయ్యి చంచల్ గూడా జైలులో రెండు వారాలు రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో అతనిని ప్రశ్నించేందుకు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసుల తరపున న్యాయవాది మల్కాజ్‌గిరి పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు. దానిపై ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత న్యాయమూర్తి ఈ కేసు తదుపరి విచారణని ఈ నెల 26కి వాయిదా వేశారు.
బండి భగీరథ్ తనపై లైంగిక దాడి చేసినట్లు మైనర్ బాలిక పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పిర్యాదు చేసిన తర్వాత పోలీసులు అతనిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇది హైప్రొఫైల్ కేసు పైగా బీఆర్ఎస్ పార్టీ నుంచి తీవ్ర ఒత్తిడి కూడా ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు విచారణ కొరకు సిట్ ఏర్పాటు చేసింది. సిట్ అధికారులు విచారణ జరిపి పోక్సో కేసులో తీవ్రమైన సెక్షన్స్ కూడా జోడించారు.
ఒకవేళ ఈ కేసులో బండి భగీరథ్ దోషిగా నిరూపించబడితే కనీసం 20 ఏళ్ళు జైలు శిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెపుతున్నారు. కానీ ఈ కేసుపై పోక్సో కోర్టు ఎటువంటి తీర్పు చెప్పినా సుప్రీంకోర్టు వరకు సాగుతుంది. కనుక మరో రెండు మూడేళ్ళు ఈ కేసు విచారణ సాగినా ఆశ్చర్యం లేదు.