నేడు అంబర్ పేట్ బషీరాబాద్ నియోజకవర్గంలో ముఖ్య నేతలు, కార్యకర్తలతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అయన ఎన్టీఆర్, కేసీఆర్, వారు స్థాపించిన టీడీపి, బీఆర్ఎస్ పార్టీల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
“తెలుగు రాష్ట్రాలలో 25 ఏళ్ళకు పైగా నిలబడిన పార్టీలు రెండే రెండు. ఒకటి టీడీపి మరొకటి బీఆర్ఎస్ పార్టీ. అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కనపడకుండా పోయాయి.
ఆ రోజుల్లో ఎన్టీఆర్ అంటే ఓ రాముడు, ఓ కృష్ణుడు.. ప్రతీ ఇంట్లో అయన పేరు వినిపిస్తుండేది. అయన చేసిన దేవుడి పాత్రల ఫోటోలు కనిపిస్తూ ఉండేవి.
కనుక ఆయన టీడీపి స్థాపించి తొలి ప్రయత్నంలోనే అధికారంలోకి రాగలిగారు. కానీ 2001లో మన నాయకుడు కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఆయనకు అటువంటి గొప్ప ఇమేజ్, గుర్తింపు, చేతిలో డబ్బు ఏమీ లేవు. పైగా ఈ బక్క పల్చని మనిషి ఏం సాధిస్తాడు? అనే ప్రజలలో అపనమ్మకం ఉండేది.
ఆ పరిస్థితులలో కూడా కేసీఆర్ ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకే సాగుతూ అందరి నమ్మకం సంపాదించుకొని తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి కేంద్రంతో కోట్లాడి తెలంగాణ సాధించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా పదేళ్ళలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి చూపారు.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ళలోనే అభివృద్ధి నిలిచిపోయి అన్ని రంగాలలో రాష్ట్రం భ్రష్టు పట్టించేస్తోంది. మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ మళ్ళీ చక్కబడుతుంది. ప్రజల జీవితాలు బాగుపడతాయి,” అని అన్నారు.