ప్రధాని మోడీ ఐదు రోజుల క్రితం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ సభలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం ముంచుకొస్తోందని, కనుక అందరూ వాటి వాడకం తగ్గించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ ఈ సూచన చేసిన ఐదు రోజులకే దేశంలో చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేశాయి.
పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకి సుమారు రూ.3 చొప్పున పెంచుతున్నట్లు ప్రకటించాయి. పెరిగిన ధరలు గురువారం అర్దరాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. ఈ ప్రకారం హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.50కి పెరగగా, డీజిల్ ధర లీటరుకి రూ.95.70కి పెరిగింది.
ఇప్పటికే వాణిజ్య గ్యాస్, గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ల ధరలు పెరిగాయి. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగినందున రవాణా రంగంపై ఈ అదనపు భారం పడుతుంది. ఆ కారణంగా నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు పెరుగుతాయి.
కనుక హోటల్స్‌లో అల్పాహారం, భోజనాల ధరలు కూడా పెరుగుతాయి. అలాగే వాటిని డోర్ డెలివరీ చేస్తున్న స్విగ్గీ, జొమోటో వంటి సంస్థల సర్వీసు ఛార్జీలు కూడా పెరుగుతాయి. దేశంలో సామాన్య ప్రజలు ఇప్పటికే చాలా భారం భరిస్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా, పరోక్షంగా పడబోయే ఈ అదనపు భారాన్ని కూడా భరించక తప్పదు.