రెండు తెలుగు రాష్ట్రాలలో తరచూ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో మంటలు చెలరేగి దగ్ధం అవుతూనే ఉన్నాయి. ప్రయాణికులు ఆయువు గట్టిదైతే ప్రాణాలతో బయటపడుతున్నారు లేకుంటే మంటల్లో సజీవ దహనం అవుతున్నారు.
తాజాగా హైదరాబాద్ నుంచి ఏపీలో ప్రకాశం జిల్లా మీదుగా తిరుపతి వెళుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ఈరోజు తెల్లవారుజామున మంటలు మొదలై క్షణాలలో బస్సు దగ్ధమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తమై వెంటనే బస్సుని రోడ్డు పక్కన నిలిపివేసి ప్రయాణికులను హెచ్చరించడంతో అందరూ త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వారందరూ చూస్తుండగానే బస్సు మంటలలో కాలి దగ్ధమైంది.
ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం భీమవరం అడ్డురోడ్డు వద్ద ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఆ సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. వారిలో చాలా మంది హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రాధమిక సమాచారం ప్రకారం బస్సు ఇంజను ఉండే ప్రదేశంలో పొగలు మొదలై మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఆర్టీసీ సంస్థలు కూడా అంతరాష్ట్ర లగ్జరీ బస్సులు నడిపిస్తుంటాయి. కానీ వాటిలో ఈవిధంగా అగ్నిప్రమాదాలు జరుగవు. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల బస్సులలోనే ఎందుకు జరుగుతున్నాయి? అని ఆలోచిస్తే బస్సుల నిర్వహణ లోపం, డ్రైవర్లకు విశ్రాంతి ఇవ్వకుండా పని చేయిస్తుండటం వంటి కారణాలు కనిపిస్తాయి.
తరచూ ఇటువంటి అగ్నిప్రమాదాలు జరిగి, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కటిన చర్యలు తీసుకోకపోవడం కూడా ఓ కారణంగా కనిపిస్తోంది.