మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి ఫార్ములా ఈరేసింగ్ కేసులో మళ్ళీ నోటీసు వచ్చింది. ఈసారి నాంపల్లి ఏసీబి కోర్టు నుంచి నోటీసు వచ్చింది. ఆయనతో పాటు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ (ఏ2), హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి (ఏ3), రేసింగ్ నిర్వాహకుడు కిరణ్ మల్లేశ్వర రావు (ఏ4)కి నోటీసులు అందాయి. జూలై 31న జరిగే విచారణకు తప్పనిసరిగా రావాలంటూ ఏసీబీ కోర్టు ఆదేశించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అంటే 2023లో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్ నిర్వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశం మేరకు దీని నిర్వహణకు ఫెమా నిబంధనలకు వ్యతిరేకంగా రూ. 55 కోట్లు హెచ్ఎండీఏ విదేశీ సంస్థకు బదిలీ చేసినందుకు ఈ కేసు నమోదు అయ్యింది. విదేశాలకు నిధులు బదిలీపై ఈడీ కూడా వేరేగా కేసు నమోదు చేసి విచారణ జరుపుతోంది.