కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరద్‌పై పేట్‌బషీరాబాద్ పోలీసులు పోక్సో కేసు నమోదు చేసి ఈరోజు మధ్యాహ్నం విచారణకు హాజరు కావాలంటూ నోటీసు జారీ చేశారు. కానీ అతను అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు.
కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఈ కేసు విచారణ బాధ్యతని చేపట్టిన తర్వాత మంగళవారం మరోమారు బాధితురాలైన మైనర్ బాలిక ఇంటికి వెళ్ళి ఆమెతో మాట్లాడిన తర్వాత, పోక్సో కేసులో అత్యంత కటినమైన సెక్షన్ 5(1) రెడ్ విత్ 6 కూడా చేర్చారు. కనుక ఈ కేసులో బండి భగీరద్ దోషిగా తేలితే కనీసం 20 ఏళ్ళు జైలు శిక్ష తప్పదని న్యాయ నిపుణులు చెపుతున్నారు.
బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా వ్యవహరిస్తున్నప్పుడు ఆయన కుమారుడు ఇటువంటి కేసులో చిక్కుకోవడం చాలా బాధాకరమే. గతంలో ఇటువంటి కేసులు జరిగినప్పుడు దోషులను కటినంగా శిక్షించాలని డిమాండ్ చేసిన ఆయన, ఇప్పుడు కూడా అలాగే మాట్లాడలేకపోతున్నారు.
దీనికి ఆయన రాజకీయ మలుపు తిప్పబోతే, ఆయనపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు ఇదే తగిన అవకాశమని భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీ, బండి భగీరద్ అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలంటూ రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి చేస్తోంది. ప్రజలు కూడా నిశితంగా గమనిస్తూ ఉంటారు కనుక ప్రభుత్వం చట్ట ప్రకారమే వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతోంది.