విజయ్‌ నిర్ణయం అప్పుడు రైట్ ఇప్పుడు రాంగ్?

May 12, 2026


img

టీవీకే పార్టీతో బిజేపి పొత్తు కోసం కేంద్ర ప్రభుత్వం విజయ్‌పై ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ లొంగలేదు. చాలా ధైర్యంగా ఒంటరిగా పోరాడారు. బహుశః అదే తమిళ ప్రజలను, ముఖ్యంగా ఆయన అభిమానులను ఆకర్షించి ఉండవచ్చు. ధైర్యంగా నిలబడగల యువకుడని విజయ్‌ నిరూపించుకోవడంతో ప్రజలు ఆయనకు తొలి ప్రయత్నంలోనే 108 సీట్లు ఇచ్చి ఆశీర్వదించారు. ఆ తర్వాత దాదాపు వారం రోజుల పాటు సాగిన సస్పెన్స్, డ్రామా గురించి అందరికీ తెలిసిందే. 

కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్ళు, కొమ్ములు తిరిగిన డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను, వాటి వెనుకే ఉన్నా కాంగ్రెస్‌, బిజేపిలను విజయ్‌ ఒంటరిగా ఎదుర్కొన్నందుకు ప్రజలు మెచ్చి అధికారం కట్టబెడితే, సరిగ్గా అదే కారణంగా భవిష్యత్‌లో అయన ప్రభుత్వం కూలిపోయినా ఆశ్చర్యం లేదు.      

అన్నాడీఎంకే-బిజేపిల స్నేహ హస్తం అందుకోకుండా వివిధ పార్టీలకు చెందిన 12మంది ఎమ్మెల్యేల మద్దతుతో 120 మందితో కూడిన బొటాబొటి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం గొప్పగానే అనిపించవచ్చు. కానీ భవిష్యత్‌లో ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి కలిగిన ప్రతీసారి అది తెలివైన నిర్ణయం కాదనిపిస్తూనే ఉంటుంది. ఎన్నికలకు ముందు అన్నాడీఎంకే-బిజేపిలను వద్దనుకున్నప్పటికీ ఇప్పుడు వాటి మద్దతు స్వీకరించి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని ఉండి ఉంటే మరో 5 ఏళ్ళ వరకు నిశ్చింతగా అధికారంలో కొనసాగగలిగేవారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందుతూ ఉండేవి కదా? 

కనుక బిజేపికో దూరంగా ఉండాలనే విజయ్‌ నిర్ణయం అప్పుడు కరెక్ట్, అదే భవిష్యత్‌లో రాంగ్ కావచ్చు. 

ప్రస్తుతం ప్రజల సానుభూతి, మోజు ఇంకా బలంగా ఉన్నందున కొంతకాలం పాటు ఎవరూ విజయ్‌ ప్రభుత్వానికి హాని తలపెట్టకపోవచ్చు. కానీ విజయ్‌ నెత్తి మీద కత్తి ఎప్పుడూ వ్రేలాడుతూనే ఉంటుంది. అదెప్పుడు తెగి పడుతుందనేది ఆయనకీ తెలియదు.       

Related Post