ప్రధాని ఆశీర్వాదం కోరిన సిఎం రేవంత్.. విమర్శించక తప్పలేదు!

May 12, 2026


img

మొన్న ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డితో కలిసి అభివృద్ధిపనులు ప్రారంభిస్తున్నప్పుడు, బద్ధ విరోధ బిజేపి, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన వారిరువురూ అంత ఆప్యాయంగా నవ్వుతూ కబుర్లు చెప్పుకోవడం చూసి చాలా మంది ఆశ్చర్యపోయే ఉంటారు. 

సిఎం రేవంత్ రెడ్డి పార్టీలు, రాజకీయాలను పక్కన పెట్టి తెలంగాణ అభివృద్ధికి మీ ఆశీర్వాదం కావాలని, తమ ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా బహిరంగంగా ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘వికసిత్ భారత్‌’లో తెలంగాణ కూడా భాగస్వామిగా ఉంటుందని చెప్పారు. ప్రధాని మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. 

కానీ అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ‘పశ్చిమ బెంగాల్ తర్వాత మా నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ’ అని ప్రకటించారు. అంతకు ముందు హైదరాబాద్‌లో ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ నివాసాలకు వెళ్ళారు. చంద్రబాబు నాయుడుతో ప్రధాని మోడీ సుమారు గంట సేపు భేటీ అయ్యారు. తద్వారా వచ్చే ఎన్నికలలో తెలంగాణలో కూడా టీడీపి, బిజేపి, జనసేన మూడు పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నట్లు సంకేతం ఇచ్చినట్లే భావించవచ్చు.

కనుక ప్రధాని మోడీ ప్రసంగంపై సిఎం రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించక తప్పలేదు. అయితే ‘తెలంగాణలో బిజేపి అధికారంలోకి’ అనే అంశం గురించి మాట్లాడే బదులు, బంగారం కొనుగోలు మానుకోమని, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోమని ప్రధాని మోడీ చేసిన సూచనలను తప్పు పడుతూ ఇలాంటి అనాలోచిత నిర్ణయాలు, విధానాలతో దేశాన్ని భ్రష్టు పట్టించేస్తున్నారని సిఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. 

మూడు నాలుగు గంటల వ్యవధిలో ప్రధాని మోడీ-సిఎం రేవంత్ రెడ్డి మద్య సంబంధాలు ఇంతగా దెబ్బ తినడం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ ‘నా బంగారి పుట్టలో వేలుపెడితే కుట్టనా?’ అని గతంలో కేసీఆర్‌ మోడీపై కత్తి దూశారు. ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి కూడా దూస్తున్నారు. అంతే! అని సరిపెట్టుకోవాలి.


Related Post