టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్న సెంట్రింగ్ గుట్టేదారుల అసోసియేషన్ సభ్యులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నగరంలో ఎక్కడ చూసినా పెద్దపెద్ద భవనాలు నిర్మాణం అవుతున్నాయి. వాటి వెనుక ఈ సెంట్రింగ్ కార్మికుల కష్టాలు, కన్నీళ్ళు, సమస్యలు అనేకం ఉన్నాయి. వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఈ పనులు చేస్తూ కుటుంబాలను పోషించుకుంటారు.
అందరూ యూపీ, బిహార్, ఒడిశా వంటి దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తుంటారు. వారికేదైనా జరగరానిది జరిగితే వారి కుటుంబాలు రోడ్డున పడతాయి. వారిని తీసుకువచ్చి పని చేయిస్తున్న గుత్తేదారు కూడా రోడ్డున పడతాడు.
కనుక తమకు ఈఎస్ఐలో ఉచిత వైద్య సదుపాయం అందించాలని వారు కోరుతున్నారు. ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. కానీ గుత్తేదారు కార్మికుల పేర్లు నమోదు చేసిన మూడు నెలల తర్వాత వారికి ఈఎస్ఐ సదుపాయం లభిస్తుంది. ఈ లోగా వారికి ప్రమాదం జరిగితే? లేదా మూడు నెలల్లోనే పని ముగిసిపోతే? ఈఎస్ఐ కార్డు ఉండి ఏం ప్రయోజనం?
వారి డిమాండ్ న్యాయమైనదే. గొంతెమ్మ కోర్కె కోరడం లేదు కనుక ప్రభుత్వం తక్షణం వారిని చర్చలకు పిలిచి వారి సమస్యలు పరిష్కరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను,” అని కల్వకుంట్ల కవిత అన్నారు.