సంక్రాంతికి 6,431 ప్రత్యేక బస్సులు

January 07, 2026
img

హైదరాబాద్‌లో అప్పుడే సంక్రాంతి పండుగ హడావుడి మొదలైపోయింది. ముందుగా సినిమాల ట్రైలర్‌, ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లతో హడావుడి మొదలైంది. జనవరి 9 నుంచి విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

హైదరాబాద్‌లో ఐటి కంపెనీలు ఉద్యోగులకు జనవరి 10,11 (శని, అదివారం) వారాంతపు సెలవులున్నాయి. కనుక 9వ తేదీ సాయంత్రం నుంచే హైదరాబాద్‌ నుంచి లక్షల మంది విజయవాడ, ఉభయగోదావరి జిల్లాలలోని తమ సొంతూర్లకు బయలుదేరుతారు.

ఇప్పటికే రైళ్ళు, బస్సులు, విమానాల టికెట్స్ అయిపోయాయి. కనుక టిజీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండుగకు ఏకంగా 6,431 ప్రత్యేక బస్సులు నడిపించబోతోంది. అయితే ఈ ప్రత్యేక బస్సులలో టికెట్ ఛార్జీ 50 శాతం అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే సాధారణ టికెట్ ధర వంద రూపాయలు ఉంటే, రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

హైదరాబాద్‌ నుంచి ఏపీలో వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేసిన తర్వాత తిరుగు ప్రయాణంలో బస్సులు దాదాపు ఖాళీగా వెనక్కు తిరిగి రావాల్సి ఉంటుంది. కనుక అదనపు ఛార్జీ వసూలు చేయక తప్పడం లేదని టిజీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన బస్టాండ్స్ మరియు బోయినపల్లి, కేపీహెచ్‌బీ, ఆరాంఘర్, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఎల్బీ నగర్‌, నుంచి బయలుదేరుతాయి. ఈ నెల 9, 10,12,13,18,19 తేదీలలో ఈ ప్రత్యేక బస్ సర్వీసులు నడుస్తాయి. 


Related Post