తెలంగాణ గ్రామీణ నేపధ్యంతో ఇప్పుడు చక్కటి సినిమాలు వస్తున్నాయి. అటువంటిదే ‘బ్యాండ్ మేళం’ కూడా. ‘కోర్ట్-వర్సస్ నో బడీ’ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన యువ నటులు హర్ష్ రోషన్, శ్రీదేవి ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాలో శ్రీదేవి పల్లెటూరి గడుసు అమ్మాయి రాజమ్మగా నటించింది.
ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కనుక సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేశారు. దానిలో భాగంగా ఒక్కో పాటని వరుసగా రిలీజ్ చేస్తున్నారు. ‘తిప్పుకుంటున్నావే... ‘ అంటూ హుషారుగా సాగే లిరికల్ వీడియో సాంగ్ శనివారం విడుదల చేశారు. చంద్రబోస్ వ్రాసిన ఈ పాటని విజయ్ బులగనిన్ స్వరపరిచి సంగీతం అందించగా, రాము రాథోడ్, అదితి భావరాజు కలిసి పాడారు. ఈ పాటకు హర్ష్ రోషన్, శ్రీదేవి బృందం అంతే హుషారుగా డాన్స్ చేశారు.
ఈ సినిమాకి కధ, ఎడిటింగ్, స్క్రీన్ ప్లే: శివ ముప్పరాజు, సంగీతం: విజయ్ బులగనిన్, కెమెరా: సతీష్ ముత్యాల చేస్తున్నారు. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో కోనా ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా మార్చి 13న విడుదల కాబోతోంది.