కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో దేశంలో మావోయిస్టులని ఏరివేస్తుండటంతో పలువురు చిన్నా పెద్ద నేతలు పోలీసులకు లొంగి పోయి ప్రాణాలు దక్కించుకున్నారు. వారిలో మావోయిస్ట్ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ కూడా ఒకరు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ఒకప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. ఒకప్పుడు మా సిద్దాంతాలకు, పోరాటాలకు తుపాకులు అవసరం కాగా, ఇప్పుడవే అడ్డంకిగా మారాయి. మారిన పరిస్థితులని బట్టి మేమూ మారలేకపోవడం వలన నష్టపోయాము. పార్టీ విధానాలు, వ్యూహాలు, ఆయుధాలు అన్నిటినీ పార్టీ నిర్ణయించాల్సి ఉండగా, తుపాకులే పార్టీని శాశించడం మొదలుపెట్టినప్పటి నుంచి మావోయిస్టులు గాడి తప్పారు. దానిని సరిదిద్దుకోలేని స్థితికి చేరుకున్నాము.
కనుక ఇప్పటి పరిస్థితిని బట్టి తుపాకులు పోలీసులకు అప్పగించేశాము. ఇప్పుడు రాజ్యాంగం చేతపట్టుకొని ప్రజలలోకి వెళ్ళాలనుకుంటున్నాము. నేను బయటకు వచ్చి లొంగిపోయినప్పుడు నన్ను చాలా మంది విమర్శించారు. కానీ నా తర్వాత చాలా మంది పోలీసులకు లొంగిపోయారు. అంటే నా నిర్ణయం సరైనదేనని స్పష్టమైంది. ఇక మావోయిస్టులే కనుమరుగు అయ్యారు కనుక నాయకత్వం ఎవరనే ప్రశ్నే ఉత్పన్నం కాదు,” అని అన్నారు.
అడవులలో నివసించే మావోయిస్టులపై కూడా పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా పడిందనే కొత్త విషయం మల్లోజుల వేణుగోపాల్ బయట పెట్టారు. కేంద్ర ప్రభుత్వం హటాత్తుగా పెద్దనోట్లు రద్దు చేయడంతో దాదాపు రూ.20కోట్లు మార్చుకోలేకపోయామని చెప్పారు.
శ్రీలంకలో దశాబ్దాల పాటు గెరిల్లా పోరాటాలు చేసిన ఇద్దరు వ్యక్తులు 1989లో పోరాటాలు వదిలి బయటకు వచ్చిన తర్వాత వారి వద్ద ల్యాండ్ మైన్ ప్రేలుళ్ళు, ఇతర పోరాట పద్దతులలో శిక్షణ పొందామని మల్లోజుల వేణుగోపాల్ మీడియాకు తెలిపారు.