రెండు తెలుగు రాష్ట్రాలలో లోన్ యాప్స్ వేధింపులు ఆగడం లేదు. తరచూ ఎవరో ఒకరు వాటి వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా పొరుగు రాష్ట్రం ఏపీలోని మచిలీపట్నంలో కాసానిగూడెంకు చెందినా ఈడే గిరీష్ కుమార్ అనే యువకుడు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు.
ఈడే గిరీష్ కుమార్ ఓ ప్రభుత్వ రంగ సంస్థలో అవుట్ సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం వ్యక్తిగత అవసరాల కోసం ఓ లోన్ యాప్ సంస్థ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. నెలనెలా వాయిదాలు చెల్లిస్తూనే ఉన్నాడు. ఇటీవల కొన్ని కొత్త సమస్యలు ఎదురవడంతో ఒక నెల వాయిదా చెల్లించలేకపోయాడు. అప్పటి నుంచి అతనికి వేధింపులు మొదలయ్యాయి.
తనకు కొంత సమయం ఇస్తే తప్పకుండా చెల్లిస్తానని అతను ఎంతగా వేడుకోన్నప్పటికీ లోన్ యాప్ నిర్వాహకులు ఒప్పుకోలేదు. రోజూ డబ్బు కోసం వేధిస్తూనే ఉన్నారు. వారి వేధింపులు భరించలేక ఉత్తరం వ్రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేసుకొని లోన్ యాప్ నిర్వాహకుల కోసం గాలిస్తున్నారు.
లోన్ యాప్స్ వేధింపుల గురించి తెలియక దేశంలో ఎన్ని లక్షల మంది లోన్స్ తీసుకొని బలవుతున్నారో? ఎవరికెరుక? అయినా ప్రభుత్వాలు, పోలీసులు లోన్ యాప్ సంస్థలని కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోలేకపోతున్నాయి. అందువల్లే ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి.