ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొన్న తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి చాలా చక్కటి సూచనలు చేశారు. క్లుప్తంగా ఆ వివరాలు...
1. ఏఐ పరుగు ఇప్పటికే మొదలైంది. దీని వలన లాభనష్టాలు రెండూ ఉన్నాయి. శరవేగంగా సాగుతున్న ఏఐ వేగం మనం కూడా అందుకొని, దాని లాభాలను ఒడిసిపట్టుకుంటూ, నష్టాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక జీఎస్టీ కౌన్సిల్, నీతి ఆయోగ్‌లాగే ఏఐ నేషనల్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని నేను ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాను.
2. ఈ కౌన్సిల్ ఏడాదికి రెండు మూడుసార్లు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో సదస్సులు నిర్వహించాలి.
3. పారిశ్రామిక విప్లవం మొదలైనప్పుడు దానిని అందుకోలేక భారత్ వెనుకబడింది. సాఫ్ట్‌వేర్ రంగాన్ని సకాలంలో అందిపుచ్చుకుంది. కానీ దానిలో మన ఐటి కంపెనీలు, నిపుణులు కేవలం ఉద్యోగాలకు, సేవలు అందించడానికే పరిమితమయ్యారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి విదేశీ ఉత్పత్తులను, వాటి సేవలనే వాడుకుంటున్నాము తప్పితే సొంతంగా ఏమీ తయారుచేసుకునే ఆలోచన చేయడం లేదు. ఇప్పుడు ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ఐటి రంగంలో భారత్ కొత్త ఆవిష్కరణలు చేయాలి. ప్రపంచ లీడర్‌గా ఎదగాలి!
4. ఏఐతో కలిగే లాభనష్టాలను, దానిని సమర్ధంగా వినియోగించుకోవడం, ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకొని వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఏఐ వార్ రూమ్ ఏర్పాటు చేయాలి.
5. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి.
6. తెలంగాణలో ఏఐ స్టార్టప్ విలేజ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. కనుక దేశ విదేశాలకు చెందిన ఐటి కంపెనీలు, నిపుణులు హైదరాబాద్‌కు తరలిరావాలి.
7. ఏఐ వలన ఉద్యోగాలు కోల్పోతున్నవారిని ఆదుకునేందుకు వారికి కొత్త నైపుణ్యాలు నేర్పేందుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి.
8. హార్డ్ వేర్ రంగంలో కూడా భారత్ ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది. కనుక కేంద్ర ప్రభుత్వం దానిపై కూడా దృష్టి సారించాలి.