పూలే విగ్రహం కోసం మరో పోరాటానికి సిద్ధం: కవిత

February 20, 2026


img

తెలంగాణ జాగృతి  అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు జూబ్లీహిల్స్‌లో కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ, “గత రెండున్నరేళ్ళుగా ట్యాంక్ బండ్ మీద పూలేగారి విగ్రహం పెట్టాలని మేము పోరాడుతున్నాము.

మా పోరాటాలకు దిగివచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం విగ్రహం ఏర్పాటు చేయిస్తోంది. అయితే శాసనసభలో కూడా పూలే విగ్రహం పెట్టినప్పుడే ఆయనకు పూర్తి గౌరవం ఇచ్చినట్లవుతుంది. అంతవరకు మా పోరాటం సాగుతుంది.

బతుకమ్మ లేని తెలంగాణ తల్లి విగ్రహం ప్రజలకు ఆమోదం కాదు. అధికారంలో ఉన్నాము కదాని తమ నిర్ణయాలను బలవంతంగా ప్రజలపై రుద్దితే ప్రజలు అంగీకరించరు. అయినా అలాగే చేస్తామంటే ‘వినాశకాలే విపరీత బుద్ధి’అనుకోవాల్సి ఉంటుంది,” అని అన్నారు. 

బీసీ రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ, “బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలని సిఎం రేవంత్ రెడ్డికి నిజంగా చిత్తశుద్ధి ఉండి ఉంటే అఖిలపక్షాన్ని ప్రధాని మోడీ వద్దకు తీసుకు వెళ్ళి రిజర్వేషన్స్ కోసం ఒత్తిడి చేసి ఒప్పించాలి.

కానీ అలా చేయకుండా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వకుండానే ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒకదాని తర్వాత మరొక ఎన్నికలు నిర్వహించుకుంటూపోతోంది. బీసీల సంక్షేమానికి 20,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాము,” అని కల్వకుంట్ల కవిత అన్నారు. 


Related Post