ఇప్పుడు మాటలు కావు చేతలు ముఖ్యం!

February 17, 2026


img

మాజీ సీఎం, బీఆర్ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ, “తెలంగాణ సాధించిన ఘనుడు కేసీఆర్‌. ఆయన ఆనవాలు చెరిపేస్తానని సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. తెలంగాణ అంటేనే కేసీఆర్‌. కేసీఆర్‌ అంటే తెలంగాణ అయినప్పుడు నువ్వు ఆయన ఆనవాలు ఎలా చెరిపేయగలవు?” అంటూ నిప్పులు చెరిగారు. 

మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించడంతో సిఎం రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్‌ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ బీఆర్ఎస్‌ పార్టీ నేతలను ఎద్దేవా చేస్తున్నారు. వారికి జవాబుగానే కేటీఆర్‌ ఈవిధంగా నిప్పులు చెరిగినట్లు అర్ధమవుతూనే ఉంది. 

కేటీఆర్‌ చెప్పినట్లు తెలంగాణ నుంచి కేసీఆర్‌ని విడదీయడం, ఆయన ఆనవాలు చెరిపేయడం అసాధ్యమే. కానీ బీఆర్ఎస్‌ పార్టీ ఇలా ప్రతీ ఎన్నికలలో వరుసగా ఓడిపోతుంటే, దాని స్థానంలోకి బిజేపి లేదా మరో పార్టీ ప్రవేశిస్తే, అప్పుడు కాంగ్రెస్‌-బిజేపి లేదా మరో పార్టీ మద్యనే రాజకీయ ఆధిపత్య కొనసాగుతుంటే క్రమంగా బీఆర్ఎస్‌ పార్టీ ఉనికి కోల్పోతుంది. 

కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీని, రేవంత్ రెడ్డిని ఖాతరు చేసేవారే కారు. కానీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌ పార్టీ... రేవంత్ రెడ్డితో మనుగడ కాపాడుకోవడం కోసం బీఆర్ఎస్‌ పార్టీ పోరాడ వలసివస్తోంది కదా?

కల్వకుంట్ల కవిత త్వరలో కొత్త పార్టీ ఏర్పాటు చేసుకోబోతున్నారు. ఒకవేళ జిహెచ్‌ఎంసి మిగిలిన కార్పోరేషన్లకు జరుగబోయే ఎన్నికలలో కూడా బీఆర్ఎస్‌ పార్టీ ఓడిపోతే ఆమె బీఆర్ఎస్‌ పార్టీని నిలువునా చీల్చడం ఖాయమే. కనుక ఇప్పుడు మాటలు కావు చేతలు అవసరం!  


Related Post