ఎర్రబెల్లి ఆవేదనకు అర్ధముందా?

February 17, 2026


img

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ బీఆర్ఎస్‌ పార్టీ చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోయింది. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కంట తడి పెట్టారు. మున్సిపల్ కార్యాలయం బయట గేటు వద్ద నిలబడి మీడియాతో మాట్లాడుతూ, “మా కార్యకర్తలు నా మొహం చూసి రేయింబవళ్ళు ఎంతో కష్టపడి పనిచేశారు. వాళ్ళకిప్పుడు నేను ఎలా మొహం చూపాలి? ఏమని సమాధానం చెప్పుకోవాలి? ప్రజలు కూడా మావైపే ఉన్నారు. ప్రజలకి కేసీఆర్‌ అన్నా, నేనన్నా చాలా ప్రేమ. అందుకే మాకు 16కి 9 సీట్లు ఇచ్చారు. 

కానీ కాంగ్రెస్‌ దొడ్డిదారిన మున్సిపాలిటీని దక్కించుకుంది. రాజకీయాలు ఇంతగా దిగాజారిపోతాయని నేను ఎన్నడూ ఊహించలేదు. ఈ పరిస్థితి చూస్తుంటే రాజకీయాలలో ఉండాలా వద్దా? అనిపిస్తోంది,” అని ఆవేదన వ్యక్తం చేశారు. 

తొర్రూర్‌ మున్సిపాలిటీలో మొత్తం 16 సీట్లు ఉండగా వాటిలో బీఆర్ఎస్‌ పార్టీ 9, కాంగ్రెస్‌ 7 గెలుచుకున్నాయి. కనుక బీఆర్ఎస్‌ పార్టీకి పీఠం దక్కాలి. కానీ ఈ పదవుల ఎన్నికలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎక్స్‌ అఫీషియోలుగా ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. మూడు పార్టీలు అవసరమైన చోట ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఉపయోగించుకున్నాయి కూడా. 

కనుక కాంగ్రెస్‌ పార్టీ తొర్రూర్‌లో తమ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్విని రెడ్డిల ఓట్లు ఉపయోగించుకోవడం తప్పు కాదు. రెండు పార్టీలకు చెరో 9 మంది మద్దతు ఉంది కనుక ఆనవాయితీ ప్రకారం ఎన్నికల అధికారి లాటరీ వేశారు. ఆ లాటరీ బీఆర్ఎస్‌ పార్టీకి తగిలి ఉంటే ఎర్రబెల్లి ఇలా మాట్లాడేవారే కారు. కానీ కాంగ్రెస్‌కి తగిలింది కనుక రాజకీయాలలో నైతిక విలువలు, కార్యకర్తల కష్టం అంటూ మాట్లాడుతున్నారు.

 ఒకవేళ తొర్రూర్ ప్రజలకు ఎర్రబెల్లి, కేసీఆర్‌, బీఆర్ఎస్‌ పార్టీపై అంత అభిమానమే ఉండి ఉంటె 16కి 16 సీట్లు లేదా 16కి 14 లేదా 12 సీట్లు అయిన ఇచ్చి గెలిపించుకునేవారే కదా? కానీ కాంగ్రెస్‌కు కూడా 7 సీట్లు ఇచ్చారు కదా? కనుక పదవులు చేజారిపోయాయనే బాధ తప్ప మరి ఇందులో అనైతికత ఏముంది?    


Related Post