హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న అమీర్ పేటలో శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడ గల మైత్రీవనం కాంప్లెక్స్‌లోని ఆదిత్య ఎన్‌క్లేవ్‌లో అనేక కోచింగ్ సెంటర్లున్నాయి. వాటిలో మొదటి అంతస్తులో ఉన్న ఓ కోచింగ్ సెంటరులో విద్యుత్ ప్యానల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు మొదలై క్షణాలలో పైకి వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకొని ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతూనే, పై అంతస్తులలో కోచింగ్ సెంటర్లలో చిక్కుకుపోయిన విద్యార్ధులను నిచ్చెనల ద్వారా భద్రంగా కిందకు దించుతున్నారు.
అమీర్ పేటలో వందలాది కోచింగ్ సెంటర్లున్నాయి. ఉన్నత చదువులు, ప్రభుత్వోద్యోగాలు సాధించేందుకు, వివిధ సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి యువత హైదరాబాద్ వచ్చి హాస్ట ల్స్‌లో ఉంటూ అమీర్ పేటలో శిక్షణ పొందుతుంటారు. కనుక నగరంలో పలు ప్రాంతాలలో వందల సంఖ్యలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటయ్యాయి.
కానీ ఇలాంటి అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు సురక్షితంగా బయటపడేందుకు తగిన ఏర్పాట్లు ఎక్కడా కానరావు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు వచ్చి మంటలు ఆర్పేస్తే తమ పని అయిపోయినట్లు అగ్నిమాపక శాఖ భావిస్తుంది తప్ప అగ్ని ప్రమాదాల నివారణకు ఆయా భవన యజమానులు, కోచింగ్ సెంటర్లు తగిన ఏర్పాట్లు చేశాయా లేదా అని పట్టించుకోదు. అందువల్లే అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు అంతా గందరగోళ పరిస్థితి నెలకొని ఉంటుంది.