ఐబొమ్మ రవి బెయిల్‌పై బయటకు

February 19, 2026
img

సంచలనం సృష్టించిన ఐబొమ్మ రవి గురువారం బెయిల్‌పై చంచల్ గూడా జైలు నుంచి బయటకు విడుదలయ్యారు. మూడు నెలల పాటు జైల్లో ఉన్న తర్వాత న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

ముఖ్యంగా పాస్ పోర్ట్ పోలీసులకు అప్పగించాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ళకూడదనే రెండు షరతులు విధించింది. అతని తరపు న్యాయవాది మాట్లాడుతూ, “రవికి ఎప్పుడో బెయిల్‌ రావాల్సి ఉంది.

కానీ మద్యలో పండుగ సెలవులు ఇతర కారణాల వలన ఇంత ఆలస్యమైంది. చట్ట ప్రకారం పోలీసులు 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్‌ షీట్ దాఖలు చేయాలి. కానీ ఇంతవరకు అదీ దాఖలు చేయలేదు. త్వరలో విచారణ పూర్తయిన తర్వాత వేస్తారేమో? చార్జ్ షీట్‌లో వారు పేర్కొన్న అభియోగాలను బట్టి ఈ కేసులో ఏవిధంగా ముందుకు వెళ్ళాలో ఆలోచించుకుంటాము,” అని చెప్పారు. 

హైదరాబాద్‌కు చెందిన రవి విదేశాలలో ఉంటూ తెలుగుతో సహా పలు భాషల సినిమాలు పైరసీ చేసి తన ఐబొమ్మతో సహా మరికొన్ని వెబ్‌సైట్లలో పెడుతూ సినీ పరిశ్రమకు వందల కోట్లు నష్టం కలిగించారు.

ఆ కేసులోనే పోలీసులు అతనిపై కేసు నమోదు చేయగా, “దమ్ముంటే నన్ను పట్టుకోండి.. నన్ను పట్టుకోవడం మీ వల్ల కాదు,” అంటూ తెలంగాణ పోలీసులకు సవాలు విసిరాడు. కానీ మూడు నెలల క్రితం హైదరాబాద్‌ వచ్చినప్పుడు పోలీసులు కూకట్‌పల్లిలో అతనిని అరెస్ట్ చేసి జైలుకి పంపారు. 

బెయిల్‌పై బయటకు వచ్చాడు కనుక ఇప్పుడు ఐబొమ్మ రవి ఏం చేయబోతున్నాడో... పోలీసులు ఏం చేయబోతున్నారో?

Related Post