తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేడు జూబ్లీహిల్స్‌లో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, “మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకున్నారు. కానీ మహాలక్ష్మి పధకం ప్రవేశపెట్టిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ కొత్త బస్సులు ఏర్పాటు చేయలేదు. దాంతో మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం ఆర్టీసీ కార్మికులనైనా సిఎం రేవంత్ రెడ్డి పట్టించుకున్నారా? అంటే అదీ లేదు.
వారి కాలులో ముల్లు గుచ్చుకుంటే తన నోటితో తీస్తానన్నారు. కానీ మహాలక్ష్మి పధకంతో వారిపై విపరీతమైన పని భారం పెరిగినప్పటికీ పట్టించుకోవడం లేదు. లేబర్ రూల్స్ ప్రకారం కార్మికులు రోజుకి 8 గంటలు మాత్రమే పనిచేయాలి.
కానీ ఆర్టీసీ కార్మికుల చేత డబుల్ డ్యూటీలు చేయిస్తూ వారి శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు లబార్ రూల్స్ వర్తించవా?” అని కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వానికి సూటి ప్రశ్న వేశారు.
ఈ కాలిలో ముల్లుని నోటితో తీయడమనే డైలాగ్ ఆమె తండ్రి కేసీఆర్ చెప్పిందే. కానీ ఆయన హయంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజులు ఏకధాటిగా సమ్మె చేస్తే, కేసీఆర్ ఎంత కటినంగా వ్యవహరించారో... ఆ కారణంగా ఎంత మంది కార్మికులు చనిపోయారో ప్రజలందరికీ తెలుసు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ తీర్చేయలేదు. పైగా మహాలక్ష్మితో వారిపై పని భారం విపరీతంగా పెంచిన మాట కూడా వాస్తవమే. కనుక వారి సమస్యలని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే.
రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త బస్సులు కొనుగోలు చేసింది. కానీ అవి ఏమాత్రం సరిపోవడం లేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీలు, సూపర్ సిక్స్ వంటి పధకాలు నెత్తిన పెట్టుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిమితులు ఏర్పడ్డాయి. కనుక ఆర్టీసీ కార్మికుల సమస్యలకు పరిష్కరించడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది.