ఇప్పుడు చిన్న పిల్లలు, పదో తరగతి, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్ధులు హటాత్తుగా గుండెపోటుతో చనిపోతున్న వార్తలు తరచూ చూస్తూనే ఉన్నాము. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రంలో ఇలాగే ఓ యువకుడు గుండెపోటుతో కుప్పకూలి చనిపోయాడు.
ఖమ్మం స్టేషన్ రోడ్డులో నివాసం ఉంటున్న గణపతి నారాయణ-లక్ష్మీ ప్రసన్నలకు ఏకైక కుమారుడు సాయి చంద్ర (24). అతను ఈరోజు మధ్యాహ్నం మందుల కోసం సమీపంలోని మెడికల్ షాపుకి వెళ్ళాడు. సిబ్బందితో మాట్లాడుతూ డబ్బు చెల్లిస్తుండగా హటాత్తుగా కుప్పకూలిపోయాడు.
మెడికల్ షాపు సిబ్బంది వెంటనే ప్రాధమిక చికిత్స చేస్తూ హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు.
సాయి చంద్ర బీఫార్మసీ చేసి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. నిన్న సాయంత్రమే ఖమ్మం వచ్చాడని తల్లితండ్రులు తెలిపారు. సాయి చంద్ర వారికి ఏకైక కుమారుడు కావడంతో అతని మీదే ఆశలు పెట్టుకున్నారు. బుద్ధిగా చదువుకొని ఉద్యోగంలో చేసుకుంటున్నాడని మురిసిపోతున్న తల్లితండ్రులకు తీరని శోకం మిగిల్చి సాయి చంద్ర వెళ్ళిపోయాడు.