వేలిముద్ర గాళ్ళు సిఎంలు అవుతారు: మంత్రి కొండా సురేఖ

February 18, 2026


img

తెలంగాణ మంత్రులలో మంత్రి కొండా సురేఖ కాస్త డిఫరెంట్. ఆమె ఎప్పుడు బహిరంగంగా మాట్లాడినా టంగ్ స్లిప్ అవుతూనే ఉంటారు. అలాగని టంగ్ స్లిప్ అని కూడా అనుకోలేము. ఎందుకంటే తాను మాట్లాడేది వివాదాస్పదమని తెలిసినా దానిని విశదీకరించి చెపుతారు కనుక.

తాజాగా ఓ సభలో ఆమె మాట్లాడుతూ, “వేలి ముద్రగాళ్ళు కూడా సిఎంలు అవుతారని మీకు తెలుసు. చదువురాని మంత్రుల ముందు ఎంతో కష్టపడి చదువుకున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చేతులు కట్టుకొని నిలబడాలి. చెప్పిన్నట్లు పనిచేయాలి. రాజ్యాంగంలో అలా వ్రాసుంది. మనం ఏమీ చేయలేము. 

రాజకీయ నాయకులకు చదువు ఉండదు. సబ్జెక్ట్, రూల్స్ తెలీవు. కనుక ఇష్టం వచ్చినట్లు ఏదో మాట్లాడేస్తుంటారు. అధికారులను తిడుతుంటారు. నిబంధనల ప్రకారమే నడుచుకునే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులని మాకు నచ్చినట్లే పనిచేయమని ఆదేశిస్తుంటారు. కానీ రూల్స్ ప్రకారం నడుచుకునే అధికారులను నేను డిస్టర్బ్ చేయను. వాళ్ళ పని వాళ్ళు చేసుకోనీయాలని కోరుకుంటాను. వారికే నా మద్దతు,” అని అన్నారు మంత్రి కొండా సురేఖ. 

ఆమె చెప్పింది వాస్తవమే. కానీ వాస్తవాలని ఇలా బహిరంగంగా మాట్లాడితే ఎవరో హర్ట్ అవుతారు. అప్పుడు మరో కొత్త సమస్య కొని తెచ్చుకున్నట్లే అవుతుంది కదా?

ఫైల్స్ మీద సంతకాలు చేయడానికి మంత్రులు కమీషన్లు తీసుకుంటారు. కానీ నేను తీసుకోనని బహిరంగంగా చెప్పినందుకు, బీఆర్ఎస్‌ పార్టీ ఎంతగా ఆక్షేపించిందో, దాంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంత అప్రదిష్టపాలయిందో అందరూ చూశారు కదా?  


Related Post