నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్ధ రెడ్డికి సుప్రీం కోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ పిటిషన్ వేయగా, దానిని కొట్టివేస్తూ 4 వారాలలోగా లొంగిపోవాలని సుప్రీంకోర్టు మంగళవారం తుదితీర్పు చెప్పింది.
ప్రత్యూష, సిద్ధార్థ్ రెడ్డి ఇంటర్ చదువుతున్న సమయంలో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఆమె సినీ పరిశ్రమలోకి ప్రవేశించగా, అతను ఇంజనీరింగ్‌లో చేరాడు. కానీ 2002, ఫిభ్రవరి 23న అంటే 24 సం.ల క్రితం ఇదే నెలలో ఇద్దరూ కూల్ డ్రింకులో విషం కలుపుకొని తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది కానీ సిద్ధార్థ రెడ్డి బతికిపోయాడు.
అప్పుడే అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత సీబీఐ విచారణ జరిపింది. అతను ఆమెను ఆత్మహత్యకు పురిగొల్పడం, ఆమె చనిపోవడం, అతను ఆత్మహత్యాయత్నం చేయడం నేరాలకు పాల్పడినందుకు వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.
ఈ కేసులో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు సిద్ధార్ధ రెడ్డికి 5 ఏళ్ళు కటిన కారాగార శిక్ష, రూ.5,000 జరిమానా విధించింది. దీనిని అతను హైకోర్టులో సవాలు చేయగా, జైలు శిక్షని 5 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళకు తగ్గించింది.
కానీ జరిమానా రూ.5,000 నుంచి రూ.50,000కి పెంచింది. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాలు చేయగా రెండేళ్ళ జైలు శిక్ష, జరిమానా తప్పదని స్పష్టం చేసింది. నాలుగు వారాలలోగా హైదరాబాద్ పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది.