దేశంలో మెట్రో నగరాలతో పోటీ పడుతూ దూసుకుపోతోంది హైదరాబాద్ నగరం. అలాంటి హైదరాబాద్‌లో నేటికీ మూడ నమ్మకాలతో జీవిస్తున్నవారు ఉన్నారంటే ఆశ్చర్యం కలుగుతుంది. కూకట్‌పల్లిలోని రామకృష్ణా నగర్‌లో ఓ కుటుంబం గురించి వింటే నిజమేనని నమ్మక తప్పదు.
అక్కడ ఓ ఇంట్లో తల్లి, ఓ కొడుకు, ఇద్దరు కూతుర్లు కలిసి ఓ ఇంట్లో నివసిస్తున్నారు. ఇంట్లో అందరికీ 40 ఏళ్ళు పైనే ఉంటాయి. కానీ ఎవరూ పెళ్ళిళ్ళు చేసుకోలేదు. వారందరికీ ఏసు క్రీస్తు మీద భక్తి, నమ్మకం చాలా ఎక్కువ.
వారం రోజుల క్రితం వారిలో అందరి కంటే వయసులో చిన్నదైన శైలజకు రక్తహీనత కారణంగా అనారోగ్యం పాలైంది. కుటుంబ సభ్యులు ఆమెను స్థానిక రాందేవ్ రావు హాస్పిటల్లో చేర్చారు. ఆమెకు అత్యవసరంగా రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పిన వారు అందుకు అంగీకరించలేదు. ఇతరుల రక్తం ఎక్కిస్తే పరిశుద్ధమైన ఆమె శరీరంలోకి అపవిత్రం అవుతుందని వాదిస్తూ అడ్డుకున్నారు. దాంతో ఆమె రక్తహీనత కారణంగా ఈ నెల 13న చనిపోయింది.
కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చి అందరూ కలిసి ప్రార్ధనలు చేశారు. కానీ అంత్యక్రియలు చేయలేదు. ఆమెని జీసస్ క్రీస్త్ మళ్ళీ బ్రతికిస్తాడని గట్టిగా నమ్ముతూ నాలుగు రోజులుగా ఆమె మృతదేహాన్ని ఇంట్లో పెట్టుకొని గడుపుతున్నారు.
ఆ ఇంటి నుంచి దుర్వాసన చుట్టుపక్కల వ్యాపించడంతో ఇరుగుపొరుగులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి గట్టిగా హెచ్చరించడంతో వారు ఆమె మృతదేహాన్ని ఏపీలోని కృష్ణా జిల్లాలోని కైకలూరుకి తరలించారు.