తెలంగాణా ప్రజల ఆరాధ్యదైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాదిమంది తెలంగాణవాసులు వస్తుంటారు. కనుక తిరుమల కొండపై తెలంగాణ రాష్ట్రం తరపున తెలంగాణ భవన్ నిర్మించుకునేందుకు స్థలం కేతాయించాల్సిందిగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సోమవారం ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుకి విజ్ఞప్తి చేశారు.
మంత్రి తుమ్మల నిన్న అమరావతి వెళ్ళి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కలిశారు. తిరుమల కొండపై తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం, భద్రాచలం సమీపంలో ఏపీలో గల 5 గ్రామాలను తెలంగాణకు బదిలీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
తుమ్మల గతంలో టీడీపిలోనే ఉండేవారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేశారు. కనుక ఆయన వద్దకు తుమ్మలని రాయబారంగా పంపడం చాలా మంచి ఆలోచనే. మంత్రి తుమ్మలని సిఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు సాదరంగా ఆహ్వానించి శాలువా కప్పి సత్కరించారు. మంత్రి తుమ్మల కూడా చంద్రబాబు నాయుడుకి శాలువా కప్పి భద్రాచలం సీతారామలక్ష్మణుల ప్రతిమని బహుకరించారు.
రాష్ట్ర విభజన సమయంలో పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురయ్యే తెలంగాణలో ఏడు మండలాలను కేంద్ర ప్రభుత్వం ఏపీకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ-భద్రాచలం మద్య 5 గ్రామాలు ఏపీలో ఉన్నందున, వాటిని తెలంగాణకు బదిలీ చేస్తే వాటిలో అభివృద్ధి పనులు చేపడతామని తుమ్మల తెలిపారు.
అశ్వారావుపేట మండలంలో గల పెద్దవాగు సాగునీటి ప్రాజెక్టు నుంచి విడుదలయ్యే నీటిని సమీపంలోని ఏపీ గ్రామాలలో రైతులు కూడా వినియోగించుకుంటున్నారు. కనుక భారీ వర్షాలకు దెబ్బ తిన్న ఈ ప్రాజెక్ట్ మరమత్తులకు ఏపీ ప్రభుత్వం కూడా ముందుకు రావాలని మంత్రి తుమ్మల విజ్ఞప్తి చేశారు.
ఈ మూడు విజ్ఞప్తులపై మంత్రులతో సంప్రదించి నిర్ణయం తెలియజేస్తానని చంద్రబాబు నాయుడు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా అభివృద్ధి చెందాలని తాను కోరుకుంటున్నానని అందుకు తెలంగాణ ప్రభుత్వానికి తన సహాయసహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధమని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.