తెలంగాణ మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్ధులలో పలువురు ఓటర్లకు నగదు, చీరలు, బహుమతులు పంచి పెట్టారు. ఓటర్లు కూడా తెలివి మీరిపోయారు. ఎవరు ఏమిస్తే అవన్నీ తీసుకొని తప్పకుండా మీకే ఓట్లు వేస్తామని హామీలు ఇచ్చేశారు.
కానీ ఎన్నికలలో తమకు నచ్చిన అభ్యర్ధులకే ఓట్లు వేశారు. దాంతో ఓడిపోయిన అభ్యర్ధులు గ్రామాలలో ఇంటింటికీ వెళ్ళి మేమిచ్చిన డబ్బు, చీరలు, బహుమతులు వెనక్కు ఇచ్చేయాలని అడుగుతున్నారు. కొందరు మర్యాదగా తిరిగి ఇచ్చేస్తున్నారు కూడా. అయితే కొందరు మీకే ఓటు వేశామని, కానీ ఓడిపోతే మాదా తప్పు? అంటూ ఎదురు నిలదీస్తున్నారు.
మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన ఎం.జ్యోతి ఓడిపోయారు. దాంతో ఆమె భర్త ఇంటింటికీ వెళ్ళి తాము ఇచ్చిన డబ్బు, చీరలు వసూలు చేసుకుంటున్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 9వ డివిజన్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి జాడి తిరుపతి, ఆయన భార్య రూప ఇద్దరూ డబ్బు, చీరలు పంచిపెట్టారు. అప్పుడే వారు ఓ పుస్తకంలో ఆ వివరాలు నోట్ చేసుకున్నారు. ఇప్పుడా పుస్తకం పట్టుకొని వార్డులో తిరుగుతూ తాము ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడుగుతున్నారు. లేదా మాకే ఓట్లు వేశామని ఒట్టు వేయించుకుంటున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలు మీరూ చూడండి...
(video Courtesy: Telugu Scribe)