నేడు మహాశివరాత్రి సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాలలో శివాలయాలన్నీ తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిట లాడుతున్నాయి. ఆలయాలు శివ నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి.
తెలంగాణలో వేములవాడ రాజరాజేశ్వరస్వామి, కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి, కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి, కొమురవెళ్ళి మల్లన్న స్వామి, ఇనవోలు మల్లిఖార్జున స్వామి, రామప్ప రామలింగేశ్వర స్వామి, ఛాయా సోమేశ్వరస్వామి.. తదితర శివాలయాలలో తెల్లవారుజాము నుంచే భక్తులు తరలి వచ్చి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
శివరాత్రి సందర్భంగా ఆలయాలన్నీ విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. శివరాత్రికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక ఆలయ నిర్వాహకులు అందుకు తగ్గట్లుగా భారీ ఏర్పాట్లు చేశారు.
పొరుగు రాష్ట్రం ఏపీలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, కోటప్పకొండ, పోలవరం పట్టిసంలో భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి, ద్రాక్షారామం వంటి అనేక పుణ్యక్షేత్రాలు కూడా శివరాత్రి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.